Wednesday, August 26, 2009

ఆమె బాల్యాన్ని పిండేసారు

పుట్టకుండానే ఆమె బాల్యాన్ని అమ్మేసారు.

పూరిగుడెసెలోని బాల్యం కాస్మొపొలిటన్ లోకి

ఆరంగ్రేటం చేసింది.

ఎర్ర లిప్ స్టిక్ పెదాలు ఆమె హక్కులను శాసిస్తాయి.

అతని సిగరెట్ పీకలకు ఆమె ముఖం యాష్ ట్రే అయ్యింది.

కాలి బూట్ల తన్నులు ఆమె పొట్టమీద పచ్చబొట్లయ్యాయి.

అతని సొడోమీ చేష్టలకు ఆమె వేదన రాఫ్సొడీ అయ్యింది.

ఎంగిలిమెతుకులు ఎప్పుడో ఆమె ఆకలిని చంపేసాయి.

గుక్కెడు నీళ్లతో గంపెడు ఆశలను తీర్చుకొంటుంది.

ఆమె దినచర్య అమానుషంతో మొదలై 

అకృత్యంతో అంతమౌతుంది.

ఆమె రోదన  విజిల్ సౌండ్ లో ఆవిరైపోయింది.

పెంటమీద విసిరిన బాల్యాన్ని కుక్కకూడా ముట్టదు.

చుట్టూ మొలిచిన పుట్టగొడుగులు ఆమె బాల్యాన్ని 

మళ్లీ శిలువేసాయి.

Tuesday, August 25, 2009

ఏడుపంటే ఇదేనేమో.....

ఆమె కళ్లలోని ఎర్రటి జీరకు

కాళ్లకున్న పారాణి మసకపోయింది.

ఆమె కళ్లలోని నీటి చుక్కలు మృతసముద్రపు

ఉప్పుమడులు చేసాయి.

ఆమె ఇంటిముందు జాతకవాదానికి

హేతువాదానికి అంతులేని రగడ జరుతున్నది.

ఇంతకీ ఏమయిందంటే

ఆమెకు తాళి కట్టిన తర్వాత అతనికి తంతి వచ్చింది.

జన్మభూమి మానాన్ని కాపాడటానికి బయలుదేరాడు.

తన నెత్తుటి తొ సరిహద్దులో లక్ష్మణ రేఖగా మిగిలిపోయాడు.

వధువు విధవ అయ్యింది.

కన్నె నీరు కన్నీరు గా మారింది.

ఏడుపు అంటే ఇదేనేమో.

దేవుడు గుడి లోంచి పారి పోయాడు

చార్వాకుడు యాగం చేస్తున్నాడు ఎందుకంటే

దేవుడు ఉన్నాడో లేడో తెలుసుకోవటానికట.

దేవుడు మనిషిని సృష్టించాడు.

మనిషి దేవుళ్లను సృష్టించాడు.

దేవుడు మనిషిని భూమిని ఏలుకొమ్మన్నాడు.

సర్వాంతర్యామి, నిరాకారి అయిన దేవుడిని

గుడిలో మనిషి ఖైదు చేసి, భూమిని కబ్జా చేసాడు.

భక్తి కోసం కాక భుక్తి కోసం గుడులను పెంచసాగాడు.

మతాలు, ఆచారాలతో ఆలయాల సంఖ్య పెంచాడు.

జైలులో ఖైదీ స్వేచ్ఛ లాగ అప్పుడప్పుడు

దేవునికి దర్శన సౌభాగ్యం కల్పించాడు.

చార్వాకుడు యాగం చేస్తూనే ఉన్నాడు.

దేవుడు గుడిలోంచి పారిపోయాడు.

యాగంలోంచి తర్కం బయటకు వచ్చింది.

దేవుడు మనిషి హృదయాన్ని వెతుకుతున్నాడు.

తర్కం మెదడును లొంగదీసుకొంది.