Thursday, September 24, 2009

అమ్మఒడిలో జ్ఞాపకాలు

పుట్టుట తల్లి గర్భంలో, గిట్టుట నేల తల్లి గర్భంలో

ఈ తల్లుల మధ్య విరామమే ఈ జీవన యానం.

ఇందులో అమ్మ ఒడిలో కాసిన్ని జ్ఞాపకాలు

రెండు కొండల మధ్య ఉండే సూరీడు అమ్మ

కనుబొమల మధ్య చేరి మరింత ఎరుపెక్కాడు.

అమ్మ నల్లని కురులు చూసి చీకటి సిగ్గుపడింది.

ఆమె ముఖ ధవళ కాంతికి కాబోలు చంద్రునిలో

మచ్చలు ఏర్పడ్డాయి

ఆమె సౌందర్యం చూడాలని

తొమ్మిది నెలల సుప్తావస్త ముగించి

ముత్యంలా బయటపడ్డాను.

కేరింతలు, లాలిపాటలతో ఆమె ఒడి

నిత్య సంగీత కచేరీ.

బొటన వేలు నోటిలో పెట్టుకున్నప్పుడు బాణం

సంధించిన ఏకలవ్యుడని మురిసిపోతుంది

గోరుముద్దలో అమృతం,  కవ్వానికి దొరకని పాలు.

ఆమె నాకు పెట్టే నైవేద్యం.

అమ్మ ఒడే నాకు ప్రకృతి.

నాన్నకు నా మీద కోపం ఎక్కువ. 

తన భార్య నాకు అమ్మ అయిందని, ఆమె ఒడిని నేను ఆక్రమించానని.

అమ్మ ఓర్పు చెట్టు వంటిది.  నా అల్లరిని,

నాన్న మారాంను చిరునవ్వుతో సహించేది.

అమ్మ లాలిత్యం ముందు దేవుని ఔన్నత్యం ఓడిపోయింది

అమ్మఒడిలోకి దేముడొచ్చాడు.

ఆమె ఒడిలోని జ్ఞాపకాలు ఇంకా

గుండెతడి పెట్టిస్తున్నాయి.

Tuesday, September 22, 2009

బ్లాగు పెద్దలారా దయచేసి నా ఈ కవితా చౌర్యాన్ని ఖండించండి

బ్లాగు పెద్దలకు

అయ్యా
నేను ఈ మధ్యనే మధుకీల అనే పేరుతో ఒక బ్లాగును తెరచుకొని నా అభిప్రాయాలను, కవితలను పొందుపరుస్తున్నాను. దివంగత రాజశేఖర రెడ్డి గారిపై నేను ఈ క్రింది లింకులో వ్రాసిన కవితను బుజ్జి అనే ఓ బ్లాగరి కొన్ని మార్పులతో తన బ్లాగులో మరో శీర్షికతో ప్రచురించుకొన్నారు. ఆ విషయాన్ని బొల్లోజు బాబా గారు గుర్తించి కామెంటు పెట్టారు. వారికి నా కృతజ్ఞతలు.

పెద్దలారా

దయచేసి ఈ విషయాన్ని ఖండించండి. తప్పొప్పులను మీరే నిర్ణయించండి. కనీసం ఈ అన్యాయాన్ని గుర్తించామనైనా తెలియచేయండి. ఇలా అయితే ఇక బ్లాగుల్లో వ్రాసుకొనే రాతలకు విలువేమి ఉంటుంది. ఈ రోజు ఈ విషయం నాకు జరిగింది. రేపు మరొకరికి జరిగవచ్చు. దయచేసి స్పందించండి.

అక్షరాలను మధించాను భావమనే సుధకోసం అంటూ గొప్పగా టాగ్ లైన్ గా వ్రాసుకొన్నారు. అంటే ఇదేనా??



పై పోస్టుకు కొనసాగింపు ఇది.
స్పందించిన అనానిమస్ గారికి, బృహస్పతి గారికి, పదనిసలు గారికి ధన్యవాదములు
బుజ్జిగారు తమ బ్లాగులో క్షమాపణలు ఈ విధంగా కోరారు 
క్షమించాలి ... నేను మీ కవితలొ లైన్స్ బాగున్నాయ్యని అనుకరించి వ్రాసాను.... కాని నేను ఉదయం ఆఫీసుకు వెళ్ళీతే మళ్ళీ రాత్రి 11.30 కీ వస్తాను... అప్పటి నుండి కవితలు వ్రాస్తాను... అక్కడ అనుకరించి అని వ్రాయడం మర్చిపొయాను... బాగా రాత్రీ కావడం వల్ల కావలంటె ఆ కవిత పొస్టింగ్ టైమ్ చూసుకొండి... అంతే కాని దాన్ని దొంగతనంగా పేరు సంపాదించాలని మాత్రం కాదు... అలా అయితే నా కవితలు చాలా పేపర్స్ లొను మేగ్జయిన్స్ లొను వచ్చాయి... నా కధలు 15.5.09 స్వాతి లొ అచ్చుఅయింది... 


ఎదయినప్పటికి మీ అనుమతి లేకుండా నేను అనుకరించడం తప్పు కనుక ఆ కవితను నా బ్లాగ్ నుండి 

తొలిగిస్తున్నాను...

మీ యొక్క పెద్ద మనసును బాధ పెట్టి ఉంటే ఈ చిన్న వాడిని క్షమించండి.... ఇట్లు.. రేవా....
వారు పెద్ద వారు అయిఉండవచ్చు, వారి కవితలు పెద్ద పేపర్లలో వచ్చిఉండవచ్చు, కానీ తాను అనుకరించానని చెప్పటం మరచిపోయానని అనటం క్షమార్హం కాదని అనుకొంటున్నాను.  కానీ అలా చేయటం తప్పు అని ఒప్పుకొని, తన బ్లాగునుంచి ఆ కవితను తొలగించానని చెపుతున్నారు కనుక ఈ విషయం ఇక్కదితో వదిలివేయటం మంచిదని అనిపిస్తుంది.
కానీ ఒక్క విషయం వారు తన బ్లాగులో తన పోస్టును తొలగించారు కనుక ఈ పోస్టుకు అర్ధం లేకుండా పోతుంది కనుక వారి అనుకరణను ఇక్కడ యధాతధంగా ఇస్తున్నాను.  Let this be an example  to every one who tries to forge like this. 
I once again thank every one who stood by me for this cause.  Thank you all
My poem
రాజశేఖరునికి అక్షర నివాళి

వింత కాకపోతే
సూర్యుడు చచ్చిఫోవటమేమిటి?. ఇక్కడ లేడంటే
ఎక్కడో కాంతి యాత్ర చేస్తున్నాడనే.

ఓ రైతు తన పచ్చని పైరును 
చేతులతో తడుముకోవటం.
ఫీజ్ రీఎంబర్స్ మెంట్ తో అడ్మిషను పొందిన
ఓ విద్యార్ధి తన పుస్తకాలను గుండెల కద్దుకోవటం. 
చచ్చి బతికిన ఓ అస్వస్థుని
తడి కనులలో వెలుగుతున్న దీపాన్ని.
నేను చూసాను నేను చూసాను.

ధరల విస్ఫోటనంలో మెతుకు కతుకుతున్న
పేద బతుకుల్లోని ఆత్మస్థైర్యపు సౌందర్యాన్ని.
ఓ చిన్నారి గుండె కవాటం ఒడ్దుపై పడ్డ చేప నోరైన వేళ
దానికి జీవ జలాల్ని అందించిన హస్తవాసిని.
నేను చూసాను నేను చూసాను.

జీవితపు నడకను వృద్దాప్యం దోచుకుపోతే
మూడో కాలై నిలిచి నడిపిస్తున్న పించను కర్రను.
అధికవడ్డీ అనకోండాలకు కబళింబపడుతున్న
జీవితాలలో తక్కువవడ్డీ రుణాల నెమలీక స్పర్శల్ని.
నేను చూసాను నేను చూసాను.

ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని, ఒక విశ్వసనీయతను
ఒక ఆశను, ఒక ఉత్సవాన్ని, ఒక ధీర దరహాసాన్ని
నా సమూహంలో నేను చూసాను నేను చూసాను.

మట్టిలోంచి వచ్చింది కాస్తా మట్టిలోకి చేరిందంతే.
కానీ మనసులోంచి వచ్చింది ఎప్పటికీ వీడిపోదు.
అలా ప్రవహిస్తూనే ఉంటుంది.

నేను చూస్తున్నాను. నేను చూస్తాను.
బుజ్జి గారి అనుకరణ (అనుకరణ అని వారు ఇప్పుడు చెప్పుకొంటున్నారు)
వింత కాకపోతే సూర్యుడు చచ్చిపొవడమేమిటి?. 
ఇక్కడ లేడంటే ఎక్కడో కాంతి యాత్ర చేస్తున్నాడనే కదా....!

రైతు తన పచ్చని పైరును చేతులతో తడుముకోవటం ఏమిటి...?
పురుగు పీడ పట్టిన పంటను సరిచేయలన్న తపనతొనే కదా...!

విద్యార్ధి తన పుస్తకాలను గుండెల కద్దుకోవటం ఏమిటి...?
తన ఉన్నత ఆశయాల తరంగాల చిరునవ్వులను చిందించాలనే కదా....! 

చచ్చి బతికిన ఓ అస్వస్థుని తడి కనులలో వెలుగుతున్న దీపాన్ని ఆర్పుకొవడమేమిటి...?
అస్తమిస్తున్న గుడ్డివాడి గుండెలొ సూర్యొదయం చూడాలనే కదా...!

ధరల విస్ఫోటనంలో మెతుకు కతుకుతున్నపేద బతుకుల్లోని ఆత్మస్థైర్యపు సౌందర్యం ఏమిటి...?
స్వేదం చిందిన బంగారపు మట్టిలొ మాణిక్యాలు విరియాలనే కధా....!

చిన్నారి గుండె కవాటానికి జీవ జలాల్ని అందించిన హస్తవాసి ఏమిటి....?
ధైర్య ఉత్సహపు ధీర దరహాసాన్ని అందించాలనే కధా....!

మూడ కాళ్ళ జీవితపు నడకను వృద్దాప్యం దోచుకొవడం ఏమిటి....? 
నెమలీక స్పర్శలతొ నడిపిస్తున్న భావితరపు బాట కొసమే కధా....!

నా మనసులోంచి వచ్చిన ఆలొచన మట్టిలొ చేరడం ఏమిటి...?
విశ్వసనీయత తొ నిండిన ఆశను మీలొ పెంపొదించాలనే కధా...!


బొల్లోజు బాబా గారి కామెంటు
మిత్రమా
ఈ క్రింది లింకులోని కవితస్పూర్తితో ఈ కవిత వ్రాసానని చెప్పి ఉంటే బాగుండేది. మీ నిజాయితీనలుగురికీ తెలిసేది. ఈ రోజు మీరు నా దృష్టిలో ఒక గ్రంధ చౌర్యం చేసిన వ్యక్తిగా మిగిలిపోయి ఉండేవారు కాదు. పై కవితకు మాతృక రాజశేఖరునికి అక్షర నివాళి* .....
బ్లాగు మధుకీల      కవి: సంజీవ్ 
అందరికీ  ధన్యవాదములు తెలియచేసుకొంటూ
మీ 
సంజీవ్

Saturday, September 19, 2009

ఆమెకు బట్టలు కట్టండి

కోక విప్పుతూ కోలా తాగుతుంది

ఆమె దేహం వాణిజ్య ప్రకటనలకు పెట్టుబడి

రేంప్ మీద కేట్ వాక్ లు, స్క్రీన్ మీద కాట్ సీన్ లు

ఆమె స్కిన్ షో కు ఫ్లాష్ లైట్లు వెలవెల పోయాయి.

ఆమె జీవితం ఒక్ పేజ్ త్రీ కలైడో స్కోపు

అండర్ వేర్ లు అవుటర్ వేర్ లు అయ్యాయి.

రిబ్బన్ ముక్క రుమాలుగుడ్డ ఆమె దేహానికి నిండుదనమిస్తాయి.

పబ్ లో కిక్ లు, ఎక్స్టసీ మాత్రలు, ఎంగిలి కిస్ లు ఆమె వ్యాపకం.

రెడ్ బుల్ డ్రింక్ లు, వయాగ్రా మాత్రలు మగసిరికిచ్చే ఆమె కితాబు.

సగటు భారతీయవనిత ఆమె ముందు వెగటు అయ్యింది.

నగర యాంత్రిక జీవనంలో విలువల కోసం వలువలు విడిచింది.

గ్లోబలైజేషన్ గొబ్బెమ్మ

ఆమెకు బట్టలు కట్టండి.

Friday, September 4, 2009

రాజశేఖరునికి అక్షర నివాళి*

వింత కాకపోతే
సూర్యుడు చచ్చిఫోవటమేమిటి?. ఇక్కడ లేడంటే
ఎక్కడో కాంతి యాత్ర చేస్తున్నాడనే.

ఓ రైతు తన పచ్చని పైరును 
చేతులతో తడుముకోవటం.
ఫీజ్ రీఎంబర్స్ మెంట్ తో అడ్మిషను పొందిన
ఓ విద్యార్ధి తన పుస్తకాలను గుండెల కద్దుకోవటం. 
చచ్చి బతికిన ఓ అస్వస్థుని
తడి కనులలో వెలుగుతున్న దీపాన్ని.
నేను చూసాను నేను చూసాను.

ధరల విస్ఫోటనంలో మెతుకు కతుకుతున్న
పేద బతుకుల్లోని ఆత్మస్థైర్యపు సౌందర్యాన్ని.
ఓ చిన్నారి గుండె కవాటం ఒడ్దుపై పడ్డ చేప నోరైన వేళ
దానికి జీవ జలాల్ని అందించిన హస్తవాసిని.
నేను చూసాను నేను చూసాను.

జీవితపు నడకను వృద్దాప్యం దోచుకుపోతే
మూడో కాలై నిలిచి నడిపిస్తున్న పించను కర్రను.
అధికవడ్డీ అనకోండాలకు కబళింబపడుతున్న
జీవితాలలో తక్కువవడ్డీ రుణాల నెమలీక స్పర్శల్ని.
నేను చూసాను నేను చూసాను.

ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని, ఒక విశ్వసనీయతను
ఒక ఆశను, ఒక ఉత్సవాన్ని, ఒక ధీర దరహాసాన్ని
నా సమూహంలో నేను చూసాను నేను చూసాను.

మట్టిలోంచి వచ్చింది కాస్తా మట్టిలోకి చేరిందంతే.
కానీ మనసులోంచి వచ్చింది ఎప్పటికీ వీడిపోదు.
అలా ప్రవహిస్తూనే ఉంటుంది.

నేను చూస్తున్నాను. నేను చూస్తాను.

thanks to my friend who edited this poem

Tuesday, September 1, 2009

మా వీధిలో ఈ మధ్యనే .....

శ్రీశ్రీ గీతాలను ఆలపిస్తున్నాడో త్రాగుబోతు.

ఆయన మాజీ ఎక్సైజ్ ఎస్సై ఈ మధ్యనే బెల్ట్ షాప్ పెట్టాడు.

నీళ్లు కరువయ్యాయని పాలవాడు

ఈ మధ్యనే వాటర్ టాంక్ క్రిందకు మకాం మార్చాడు.

స్కూలు మాస్టారు డి.ఎ., పి.ఆర్.సి. ల కోసం సమ్మెలోకి దిగాడు

ఈ మధ్యనే కాన్వెంటు ఆ స్కూలు విద్యార్ధులను కిడ్నాప్ చేసింది.

మా వార్డు మెంబరు కొత్తగా కాంట్రాక్టర్ అవతారమెత్తాడు

ఈ మధ్యనే డ్రైన్లు, సెమెంటు రోడ్లు మాయమయ్యాయి.

పూజారి గారు గుడి మూసే సారు.

ఈ మధ్యనే ఆలయభూముల రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు.

వీధి చివర పెద్ద బంగ్లాలో ఉండే ముసలి దంపతులు మాయమయ్యారు.

ఈ మధ్యనే వాళ్ల NRI  అబ్బాయి వృద్దాశ్రమంలో పడేశాడట.

నేను బ్లాగ్ కోసం 56 అక్షరాలను ఒడిసిపట్టుకొన్నాను

ఈ మధ్యనే భాషతో రమిస్తున్నాను, భావం పండటానికని.

Wednesday, August 26, 2009

ఆమె బాల్యాన్ని పిండేసారు

పుట్టకుండానే ఆమె బాల్యాన్ని అమ్మేసారు.

పూరిగుడెసెలోని బాల్యం కాస్మొపొలిటన్ లోకి

ఆరంగ్రేటం చేసింది.

ఎర్ర లిప్ స్టిక్ పెదాలు ఆమె హక్కులను శాసిస్తాయి.

అతని సిగరెట్ పీకలకు ఆమె ముఖం యాష్ ట్రే అయ్యింది.

కాలి బూట్ల తన్నులు ఆమె పొట్టమీద పచ్చబొట్లయ్యాయి.

అతని సొడోమీ చేష్టలకు ఆమె వేదన రాఫ్సొడీ అయ్యింది.

ఎంగిలిమెతుకులు ఎప్పుడో ఆమె ఆకలిని చంపేసాయి.

గుక్కెడు నీళ్లతో గంపెడు ఆశలను తీర్చుకొంటుంది.

ఆమె దినచర్య అమానుషంతో మొదలై 

అకృత్యంతో అంతమౌతుంది.

ఆమె రోదన  విజిల్ సౌండ్ లో ఆవిరైపోయింది.

పెంటమీద విసిరిన బాల్యాన్ని కుక్కకూడా ముట్టదు.

చుట్టూ మొలిచిన పుట్టగొడుగులు ఆమె బాల్యాన్ని 

మళ్లీ శిలువేసాయి.

Tuesday, August 25, 2009

ఏడుపంటే ఇదేనేమో.....

ఆమె కళ్లలోని ఎర్రటి జీరకు

కాళ్లకున్న పారాణి మసకపోయింది.

ఆమె కళ్లలోని నీటి చుక్కలు మృతసముద్రపు

ఉప్పుమడులు చేసాయి.

ఆమె ఇంటిముందు జాతకవాదానికి

హేతువాదానికి అంతులేని రగడ జరుతున్నది.

ఇంతకీ ఏమయిందంటే

ఆమెకు తాళి కట్టిన తర్వాత అతనికి తంతి వచ్చింది.

జన్మభూమి మానాన్ని కాపాడటానికి బయలుదేరాడు.

తన నెత్తుటి తొ సరిహద్దులో లక్ష్మణ రేఖగా మిగిలిపోయాడు.

వధువు విధవ అయ్యింది.

కన్నె నీరు కన్నీరు గా మారింది.

ఏడుపు అంటే ఇదేనేమో.