Thursday, September 24, 2009

అమ్మఒడిలో జ్ఞాపకాలు

పుట్టుట తల్లి గర్భంలో, గిట్టుట నేల తల్లి గర్భంలో

ఈ తల్లుల మధ్య విరామమే ఈ జీవన యానం.

ఇందులో అమ్మ ఒడిలో కాసిన్ని జ్ఞాపకాలు

రెండు కొండల మధ్య ఉండే సూరీడు అమ్మ

కనుబొమల మధ్య చేరి మరింత ఎరుపెక్కాడు.

అమ్మ నల్లని కురులు చూసి చీకటి సిగ్గుపడింది.

ఆమె ముఖ ధవళ కాంతికి కాబోలు చంద్రునిలో

మచ్చలు ఏర్పడ్డాయి

ఆమె సౌందర్యం చూడాలని

తొమ్మిది నెలల సుప్తావస్త ముగించి

ముత్యంలా బయటపడ్డాను.

కేరింతలు, లాలిపాటలతో ఆమె ఒడి

నిత్య సంగీత కచేరీ.

బొటన వేలు నోటిలో పెట్టుకున్నప్పుడు బాణం

సంధించిన ఏకలవ్యుడని మురిసిపోతుంది

గోరుముద్దలో అమృతం,  కవ్వానికి దొరకని పాలు.

ఆమె నాకు పెట్టే నైవేద్యం.

అమ్మ ఒడే నాకు ప్రకృతి.

నాన్నకు నా మీద కోపం ఎక్కువ. 

తన భార్య నాకు అమ్మ అయిందని, ఆమె ఒడిని నేను ఆక్రమించానని.

అమ్మ ఓర్పు చెట్టు వంటిది.  నా అల్లరిని,

నాన్న మారాంను చిరునవ్వుతో సహించేది.

అమ్మ లాలిత్యం ముందు దేవుని ఔన్నత్యం ఓడిపోయింది

అమ్మఒడిలోకి దేముడొచ్చాడు.

ఆమె ఒడిలోని జ్ఞాపకాలు ఇంకా

గుండెతడి పెట్టిస్తున్నాయి.

1 comment: